నేడు 'అనంత'లో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఈరోజు అనంతపురం జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి అయినా తర్వాత మొదటిసారి కియా కార్ల పరిశ్రమను సందర్శించనున్నారు. అంతేకాదు కియా గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లోనే సీఎం జగన్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
అయితే సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 9.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 10.30కి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో కియా కార్ల పరిశ్రమకు వస్తారు. అక్కడ కీయ పరిశ్రమ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొని 3 గంటల పాటు కార్ల పరిశ్రమలోని వివిధ విభాగాలను పరిశీలించనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా పాల్గొంటారు. అయితే వైఎస్ జగన్ తొలిసారి కియా ఫ్యాక్టరీలో అడుగుపెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా మంత్రి శంకర్ నారాయణ, అధికారులు పర్యవేక్షించారు. ఫ్యాక్టరీతో పాటూ సీఎం చేరుకునే పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించారు.
కాగా ఆగస్టులో కియా కార్ లాంఛింగ్ ఈవెంట్ జరగగా ఆ కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి జగన్‌ను కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. అయితే బిజీ షెడ్యూల్ ఉండటంతో సీఎం జగన్ ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. దీంతో జగన్ ఈ కార్యక్రమానికి వెళ్లలేదని టీడీపీ నేతలు ఎన్నో ఆరోపణలు చేశారు.. దీనిపై వైఎస్సార్‌సీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడిచింది.