ముంబై: మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి 'మహారాష్ట్ర వికాస్ అఘాడి' సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. పదవులు పంపకంపై మూడు పార్టీలు అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శివసేనకు ముఖ్యమంత్రితో పాటు 15 మంత్రి పదవులు లభించాయి. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రితో పాటు 13 కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. కాంగ్రెస్‌కు స్పీకర్‌తో పాటు 13 మంత్రి పదవులు లభించినట్టు తెలుస్తోంది. వైబీ చవాన్ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ భేటీలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, మాణిక్‌రావ్ ఠాక్రే పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
మహారాష్ట్రలో పదవుల పంపకం కొలిక్కి